యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందడి షురూ అయింది. బుధవారం మొదలైన కార్తీక మాస పూజలు నవంబర్ 23 వరకు కొనసాగనున్నాయి. బుధవారం దీక్షాపరుల మండపంలో వ్రతాలు నిర్వహించారు. గురువారం నుంచి కొత్తగా నిర్మించిన వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరపనున్నారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా కొండపైన ప్రధానాలయం, శివాలయం ఎదుట, విష్ణుపుష్కరిణి వద్ద కార్తీక దీపారాధన పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొండ కింద లక్ష్మీపుష్కరిణి ఎదుట, సత్యనారాయణస్వామి వ్రత మండపం ఎగ్జిట్ మార్గంలో దీపారాధన కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో కార్తీక దీపాలు వెలిగించడానికి అవసరమైన నూనె, నెయ్యి, ఒత్తులు అందుబాటులో ఉండేలా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన దీపారాధన ప్రదేశాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా కొండపైన బ్రహ్మోత్సవ మండపంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన సాంస్కృతిక విశ్వకళామండలి ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
రోజుకు ఆరు బ్యాచుల్లో వ్రతాల నిర్వహణ
భక్తుల తాకిడికి అనుకూలంగా ప్రతిరోజు ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు. రూ.800 వ్రత టికెట్ పై పూజా సామగ్రిని ఆలయ సిబ్బంది భక్తులకు అందిస్తున్నారు. బుధవారం నుంచి నవంబర్ 23 వరకు ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ కు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున 5 బ్యాచుల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
అందుబాటులోకి కొత్త వ్రత మండపం
యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గుట్ట కింద ఎగ్జిట్ ఘాట్ రోడ్డు పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.17.38 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో వ్రత మండపాన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన రెండు హాళ్లతో పాటు పురుషులు, మహిళలకు సెపరేట్ వాష్ రూంలు, డ్రెస్సింగ్ రూంలు, టికెట్ కౌంటర్ హాల్, అర్చక గది, డ్యూటీ ఆఫీసర్ గది, సామగ్రి అమర్చడానికి స్టోర్ రూంతో పాటు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్ లో ఒకేసారి వెయ్యి మంది దంపతులు వ్రత పూజలు నిర్వహించవచ్చు. బుధవారం వ్రత మండపంలో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆఫీసర్లతో కలిసి ఈవో గీతారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తర్వాత ఆలయం తరఫున వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో జూషెట్టి కృష్ణ గౌడ్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
దర్శనాల పునరుద్ధరణ
సూర్యగ్రహణం కారణంగా ఆలయ అర్చకులు మంగళవారం ఉదయం 8.50 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి సంప్రోక్షణ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి ఆదిపూజలైన సుప్రభాతం, ఆరాధన తదితర కైంకర్యాలను పూర్తి చేసి ఉదయం 10 గంటల నుంచి దర్శనాలను పునరుద్ధరించారు.