యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట అధ్యయనోత్సవాల్లో భాగంగా నారసింహుడు ఆదివారం ఉదయం రామావతారంలో, సాయంత్రం వేంకటేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో మూలవరులకు నిత్యకైంకర్యాలు నిర్వహించిన అనంతరం.. స్వామివారిని రామావతారంలో అలంకరించి ప్రధానాలయ మాఢ వీధుల్లో ఊరేగించారు.
సాయంత్రం నిత్యారాధనలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరస్వామిగా ముస్తాబు చేశారు. ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్ఠింపజేసి వేంకటేశ్వరస్వామి అవతార విశిష్టతను అర్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ ఉన్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి ఉదయం వెన్నకృష్ణుడు, సాయంత్రం కాళీయమర్ధనుడి అలంకార సేవలు చేపట్టనున్నారు.