ఇయ్యాల్టి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ఫిబ్రవరి 6 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మంగళవారం స్వస్తివాచనం, అంకురార్పణం, మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 2న ఎదుర్కోలు, 3న తిరుకల్యాణం, 4న రథోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న రాత్రి 7 గంటలకు నిర్వహించే స్వామివారి తిరుకల్యాణంలో పాల్గొనడానికి కల్యాణ టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు. ఫిబ్రవరి 6న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కల్యాణం, రథోత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో లైటింగ్, చలువ పందిళ్లు, మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 6 వరకు నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి.