
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనం, విశ్వక్సేన పూజలతో ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అంకురారోపణం, మృత్సంగ్రహణ కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం విశ్వక్సేన ఆరాధన చేశారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని పూజలు చేశారు.
గర్భగుడిలో ఉన్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి కంకణధారణ చేసిన అనంతరం.. ముఖ మండపంలో అధిష్టింపజేసిన ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ముస్తాబు చేశారు. వజ్రవైఢూర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం కైంకర్యాలను నిర్వహించనున్నారు.
అలరించిన గరికపాటి నృసింహ వైభవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక, సంగీత, ధార్మిక, సాహిత్య మహాసభలు భక్తులను అలరించాయి. సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన నృసింహ వైభవం ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గరికపాటి ప్రవచనాలు సాగాయి.