- ఇప్పటికే 75 శాతం పూర్తయిన పనులు
- మరో 10 రోజుల్లో మిగతావి కూడా కంప్లీట్
- 10,757 ఎస్‌ఎఫ్‌టీలకు 66 కేజీల బంగారం
యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. తాపడం పనులు గతేడాది నవంబర్‌లో ప్రారంభం కాగా.. ఇప్పటికే 75 శాతం మేర పూర్తయ్యాయి. మార్చిలో జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాల కంటే ముందే బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
2021లో నిర్ణయం
యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో అనేక మంది విరాళాలు ఇస్తామని ప్రకటించినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తర్వాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. ఆ తర్వాత బంగారు తాపడం అంశంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపుర బంగారు తాపడంపై దృష్టి సారించారు. పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో రివ్యూ నిర్వహించారు. అనంతరం బంగారు తాపడం పనులు స్పీడందుకున్నాయి.
తాపడానికి 66 కిలోల బంగారం
యాదగిరిగుట్ట రాజగోపురం 42 ఫీట్ల ఎత్తులో సుమారు 10,757 వేల ఎస్‌ఎఫ్‌టీలు ఉంటుంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 66 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం సుమారు రూ. 80 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని తేల్చారు. తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం, నగదుతో పాటు స్వామి వారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేస్తున్నారు. తాపడం పనులు చేపట్టేందుకు మొత్తం బంగారాన్ని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు అప్పగించడంతో బంగారు రేకుల తయారీ పూర్తి చేసి తాపడం పనులు చేస్తున్నారు. ఈ పనుల కంటే ముందే రూ. 12 కోట్లు ఖర్చు చేసి గోపురానికి రాగి తొడుగులు వేశారు.
మరో పది రోజుల్లో కంప్లీట్ ?
ఈ ఏడాది మార్చిలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కంటే ముందే బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. లెక్క ప్రకారం రోజుకు 125 ఎస్‌ఎఫ్‌టీల మేర పనులు చేయాల్సి ఉన్నా.. బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతుండడంతో రోజుకు 20 మందికిపైగా వర్కర్లు 200 ఎస్‌ఎఫ్‌టీల మేర తాపడం పనులు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. ఇదే మాదిరిగా పనులు చేస్తే వచ్చే నెల 7 వరకు తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. బంగారు తాపడం బయటకు కనిపించకుండా పూర్తిగా కవర్ కప్పేశారు. పనులు జరిగే గోపురం వద్దకు ఒక్కరిని కూడా అనుమతించడం లేదు. సీసీ కెమెరాల నిఘా మధ్య పనులు కొనసాగిస్తున్నారు.
స్పీడ్‌గా జరుగుతున్నాయి
యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. తాపడం పూర్తైన అనంతరం మహా కుంభాభిషేకం జరుగుతుంది. మార్చి 1 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
- ఎ.భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట