
- మార్చి 11 వరకు జరగనున్న ఉత్సవాలు
- 11 రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1న విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం పూజలతో మొదలయ్యే ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన స్వామివారి ఎదుర్కోలు 7న, తిరుకల్యాణ మహోత్సవం 8న, దివ్యవిమాన రథోత్సవం 9న నిర్వహించనున్నారు.
11వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. మార్చి 12 తర్వాత ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ముఖ మండపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అన్ని రకాల వాహనాలను కొండపైకి ఫ్రీగా అనుమతిస్తామని ఈవో భాస్కర్‌రావు ప్రకటించారు.