యాదగిరిగుట్ట, వెలుగు: రేపటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యే ఉత్సవాలు ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు. కాగా, 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఏర్పాట్లు ముమ్మరం
బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు. సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేసే పనులను స్పీడప్ చేశారు. యాదగిరిగుట్ట టౌన్, తుర్కపల్లి, రాయగిరి, వంగపల్లి, యాదగిరిపల్లిలో స్వాగత తోరణాలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టింది. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాచకొండ సీపీ తరుణ్ జోషి క్షేత్రస్థాయిలో పర్యటించి.. స్థానిక పోలీసులతో రివ్యూ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో రామకృష్ణారావు, అర్చక బృందం హైదరాబాద్‌లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. వారి వెంట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రఘు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి, నేతలు భరత్ గౌడ్, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లేశ్ ఉన్నారు.