వటపత్రశాయికి.. వరహాల లాలి వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

వటపత్రశాయికి.. వరహాల లాలి వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారు, రాత్రి హంస వాహనంపై ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగి కనువిందు చేశారు. మర్రి ఆకుపై స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదుట స్వామివారిని ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి వటపత్రశాయి అవతార విశిష్టతను భక్తులకు వివరించాచారు.

వైభవంగా హంస వాహన సేవ..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామివారికి నిత్యారాధనలు ముగిసిన అనంతరం.. రాత్రి 8:30 గంటలకు ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని హంస వాహనంపై అధిష్ఠింపజేసి ప్రధానాలయ మాడవీధుల్లో విహరింపజేశారు. హంస వాహనంపై విహరిస్తున్న స్వామిని భక్తులు దర్శించుకుని తరించారు. టెంపుల్  చైర్మన్  నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఉన్నారు.