యాదగిరిగుట్ట బంగారు తాపడం పనులు స్పీడందుకున్నయ్‌‌

యాదగిరిగుట్ట బంగారు తాపడం పనులు స్పీడందుకున్నయ్‌‌
  • ఇప్పటికే ఆలయానికి చేరుకున్న 2,300 ఎస్‌‌ఎఫ్‌‌టీ రేకులు
  • మొత్తం 60 కిలోల బంగారంతో 10 వేల స్క్వేర్‌ఫీట్ల మేర పనులు
  • చెన్నైలో కొనసాగుతున్న బంగారు రేకుల తయారీ
  • ఫిబ్రవరి 22 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు

యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు స్పీడందుకున్నాయి. మొత్తం 10 వేల స్క్వేర్‌ ఫీట్ల మేర పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే పావువంతు రేకులు పూర్తికాగా, అవి యాదగిరిగుట్టకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.

పునర్నిర్మాణం టైంలోనే నిర్ణయం

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లోనే అప్పటి సీఎం కేసీఆర్‌‌ నిర్ణయించారు. ఇందుకోసం విరాళాలను ఆహ్వానించారు. విరాళాల ద్వారా మొత్తం 12 కిలోల బంగారం సమకూరింది. ఇందులో రెండు కిలోల బంగారాన్ని ధ్వజ స్తంభం కోసం ఉపయోగించారు. మిగిలిన బంగారం, విరాళాలుగా వచ్చిన నగదు కలిపినా గోపురానికి తాపడం పనులు చేసేందుకు తగినంత సమకూరలేదు. 2022 మార్చి 8న అప్పటి సీఎం కేసీఆర్‌‌ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. ఆ తర్వాత బంగారు తాపడం పనులపై పెద్దగా ఆసక్తి చూపలేదు.  

తాపడంపై రేవంత్‌‌రెడ్డి ఫోకస్‌‌

గతేడాది కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడంతో యాదగిరిగుట్ట బంగారు తాపడం పనులపై సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టి పెట్టారు. స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించిన మిశ్రమ బంగారం, విరాళాలుగా వచ్చిన బంగారం కలిపి మొత్తంగా 23 కిలోలు సమకూరింది. దీంతో పాటు స్వామి వారికి భక్తులు సమర్పించిన 746 కిలోల వెండిని సైతం బంగారం రూపంలోకి మార్చారు. మొత్తం బంగారాన్ని మూడు విడతలుగా చెన్నైలోని మెస్సర్స్‌‌ స్మార్ట్‌‌ క్రియేషన్స్‌‌ సంస్థకు అప్పగించారు. 

ఆలయానికి చేరుకున్న 2,300 స్క్వేర్‌ఫీట్ల రేకులు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు పూర్తి చేసిన అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించి, మార్చి 1 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా 2,300 స్క్వేర్‌ఫీట్ల బంగారు రేకులు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. ఈ రేకులను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేకులను ఫిక్స్‌‌ చేయనున్నారు.

60 కిలోల బంగారం.. రూ. 80  కోట్ల ఖర్చు

స్వామి వారి రాజగోపురం 42 ఫీట్ల ఎత్తుతో సుమారు 10 వేల స్క్వేర్‌  ఫీట్ల వైశాల్యంతో ఉంది. ఒక్కో స్క్వేర్‌ ఫీట్‌‌కు 6 గ్రాముల బంగారం చొప్పున మొత్తం గోపురాన్ని బంగారుమయం చేసేందుకు 60 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం రూ. 80 కోట్లు అవసరం కాగా భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం, నగదు కలిపి రూ. 28 కోట్లు మాత్రమే సమకూరింది. మిగతా రూ. 52 కోట్లను స్వామి వారి హుండీ ఆదాయం నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. బంగారు తాపడం పనుల్లో భాగంగా ఇప్పటికే రూ. 12 కోట్లతో రాగి తొడుగులను రెడీ చేశారు. బంగారు రేకులు తయారు చేయడం, ఫిక్సింగ్‌‌ చార్జీల కోసం రూ. 8 కోట్లు అవసరం అవుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకే.. 


యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడంపై ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22 నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. బంగారు రేకుల ఫిక్సింగ్‌‌ అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం. తర్వాత మార్చి 1 నుంచి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. 


– ఎ.భాస్కర్‌‌రావు, ఈవో, యాదగిరిగుట్ట-