దేదీప్యమానంగా నారసింహుడి దివ్యవిమాన రథోత్సవం

దేదీప్యమానంగా నారసింహుడి దివ్యవిమాన రథోత్సవం
  • యాదగిరి గుట్ట క్షేత్రమైన పాతగుట్టలో కనుల పండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధ క్షేత్రమైన పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి.  ఐదో రోజు మంగళవారం రాత్రి దివ్యవిమాన రథోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు,  వెంకటాచార్యుల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. 

దేదీప్యమానంగా వెలుగొందుతున్న రథంలో కల్యాణమూర్తులను అధిష్టింపజేసి హోమం, పూజలను చేపట్టారు. ఆలయ తిరువీధుల్లో ఊరేగించగా  భక్తులు కనులారా వీక్షించారు. స్థానికులు, భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పాతగుట్ట ఆలయం కిక్కిరిసిపోయింది. రాత్రి 8 గంటలకు మొదలైన రథోత్సవం రెండు గంటల పాటు సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు, చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఏఈవో కృష్ణ గౌడ్, ఆలయ ఆఫీసర్లు, భక్తులు పాల్గొన్నారు.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థం నిర్వహించనున్నారు.