- ఒక్క నెలలోనే రూ. 18 కోట్లకు పైగా ఆదాయం
- ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు డ్రెస్‌కోడ్ అమలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మే నెలలో భారీగా ఆదాయం సమకూరింది. ఒక్క నెలలోనే రూ.18,60,39,810 ఇన్‌కం వచ్చినట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. ఇందులో గదులను రెంట్‌కు ఇవ్వడం ద్వారా రూ.43,52,565, హుండీ ద్వారా రూ.3,92,27,105, సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణతో రూ.47,18,200 ఆదాయం వచ్చింది.
అలాగే రూ.50 శీఘ్ర దర్శనం ద్వారా రూ.1,84,300, రూ.150ల వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.2,22,90,000, రూ.300ల బ్రేక్ దర్శన టికెట్ల ద్వారా రూ.95.76 లక్షలు, ఆర్జిత సేవల ద్వారా రూ.1,40,39,734 ఇన్‌కం వచ్చింది. భక్తుల తలనీలాల ద్వారా రూ.30,00,150, ప్రసాద విక్రయం ద్వారా రూ.4,49,72,210, కల్యాణకట్ట ద్వారా రూ.32,31,500, ఇతర విభాగాల నుంచి రూ.4,04,71,509 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ఏప్రిల్‌లో 15,64,05,949ల ఇన్‌కం రాగా మేలో రూ. 18 కోట్లు దాటడం గమనార్హం.
అమల్లోకి డ్రెస్‌కోడ్
యాదగిరిగుట్ట ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలన్న నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. స్వామివారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, అర్చనలు, అభిషేకం వంటి పూజల్లో పాల్గొనే పురుషులు ధోవతి లేదా తెల్ల లుంగీ, షర్ట్, స్త్రీలు చీరగానీ, చుడీదార్ కాని ధరించాలని ఆలయ ఆఫీసర్లు చెప్పారు.