
- నేడు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. లక్ష్మీనారసింహుడి లగ్గానికి యాదగిరిగుట్ట ముస్తాబైంది. లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానాలయ ఉత్తర దిశలో శనివారం రాత్రి 8:45 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ప్రధానాలయం, ఆలయ ముఖ మంటపం, యాదగిరికొండకు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. రకరకాల విద్యుత్ దీపాల అలంకరణ, లేజర్ లైటింగ్ తో యాదగిరిగుట్ట దేదీప్యమానంగా వెలుగొందుతోంది. వైకుంఠ ద్వారం, ఆలయ ఘాట్ రోడ్డు, ప్రధాన రహదారి వెంట దేవతామూర్తుల రూపాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నారసింహుడి కల్యాణం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.