
- ప్రధానాలయం చుట్టూ ఊరేగిన లక్ష్మీనారసింహుడు
- ఉదయం శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన నారసింహుడు
- నేడు పూర్ణాహుతి, చక్రతీర్థం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి దివ్య విమాన రథోత్సవం కనులపండువగా సాగింది. సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందుగా పశ్చిమ రాజగోపురం ఎదుట రథం ముందు ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు సుమారు రెండు గంటల పాటు రథాంగ హోమం, రథబలి నిర్వహించారు.
తర్వాత అందంగా అలంకరించిన రథంలో లక్ష్మీనారసింహుడిని అధిష్ఠింపజేసి ఆలయ మాడవీధుల గుండా ప్రధానాలయం చుట్టూ ఊరేగించారు. వేదపారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం జరిపారు. రథోత్సవం జరుగుతున్నంత సేపు ‘యాదగిరివాసా గోవిందా.. యాదాద్రీశా గోవిందా.. నమో నారసింహ’ అంటూ భక్తులు జయ జయధ్వానాలు చేశారు.
రథం ముందు చేసిన భజనలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన నారసింహుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటలకు నారసింహుడు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై తిరువీధుల్లో ఊరేగాడు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట స్వామి వారి సేవను అధిష్ఠింపజేసి అర్చకులు అలంకార విశిష్టతను వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని నిర్వహించిన అలంకార సేవలు ఆదివారంతో ముగిశాయి.
నేడు పూర్ణాహుతి, చక్రతీర్థం
బ్రహ్మోత్సవాల్లో పదో రోజైన సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆలయంలో మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని జరుపుతారు.
నేడు గుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం యాగశాలలో నిర్వహించనున్న మహాపూర్ణాహుతికి గవర్నర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు రానున్నారు. నేరుగా కొండపైకి చేరుకుని ప్రధానాలయ ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలకు వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.