యాదగిరిగుట్టలో ఊర చెరువుకు పూర్వ వైభవం

యాదగిరిగుట్టలో ఊర చెరువుకు పూర్వ వైభవం
  • అభివృద్ధి పేరుతో చెరువును పూడ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
  • ఊర చెరువు పునరుద్ధరణకు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న ఊర చెరువు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూడ్చేసిన ఊర చెరువుకు పూర్వ వైభవం రానుంది. చెరువుల పరిరక్షణలో భాగంగా ఊర చెరువు పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐదేళ్ళుగా కనుమరుగైన ఈ చెరువులో మళ్లీ జలకళ కనిపించనుంది. ఊర చెరువును పునరుద్ధరించి సుందరీకరించడానికి పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ అధికారులు కేవలం మూడు నెలల్లోపే  పనులు పూర్తి చేసి నీళ్లు నింపేందుకు కృషి చేస్తున్నారు. 

చెరువును పూడ్చి రింగు రోడ్డు .. 

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం అని యాదగిరిపల్లి సమీపంలో ఉన్న ఊర చెరువును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూడ్చి, రింగు రోడ్డు నిర్మించింది. చెరువును పూడ్చడంతో అందుబాటులోకి వచ్చిన భూమికి అదనంగా చెరువుకు ఆనుకుని ఉన్న రైతులకు సంబంధించిన పట్టా భూములను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్లేస్ లో టెంపుల్ రీఓపెన్ సందర్భంగా 15 రోజుల పాటు 1008 కుండలాలతో మహాకుండాత్మక యాగం నిర్వహించేందుకు వీలుగా యాగశాలలు ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది.

 కానీ అది ఆచరణ సాధ్యం కాకపోవడంతో.. కొండపైన బాలాలయంలోనే తూతూ మంత్రంగా యాగం నిర్వహించి ఆలయాన్ని పునఃప్రారంభించింది. ఆనాటి నుంచి చెరువును పూడ్చిన ప్లేస్ తో పాటు రైతుల నుంచి సేకరించిన భూమి కూడా నిరుపయోగంగా ఉంటూ వస్తోంది. ఊర చెరువును పూడ్చివేయడంతో వర్షాలు పడ్డ ప్రతీసారి వరదనీరు రోడ్లపైకి చేరి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.  

ఊర చెరువులో పూడికతీత పనులు షురూ

 కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చెరువు పునరుద్ధరణలో భాగంగా రింగు రోడ్డును తొలగించే అవకాశం లేకపోవడంతో.. మిగిలిన చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఈ పనులు ఆర్ అండ్ బీ డీఈ బీల్యా నాయక్ పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జేసీబీల సాయంతో చెరువులో మట్టిని తొలగిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదనీరు ఊర చెరువులోకి చేరుకునేలా రిపేర్లు  చేయనున్నారు.

 అలాగే ఊర చెరువు నిండి మత్తడి ద్వారా దిగువకు నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ స్థాయిలో వర్షాలు పడ్డా వరదనీరు రోడ్లపైకి చేరకుండా ఊర చెరువులోకి వెళ్లేలా డైవర్షన్లనుపెట్టనున్నారు. సుందరీకరణ పనులు కంప్లీట్ చేసి నీటితో నింపి ఊర చెరువును అందుబాటులోకి తెస్తామని డీఈ బీల్యానాయక్  పేర్కొన్నారు.