యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలోని యాదగిరిగుట్టలో బుధవారం 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎండ 40కి తగ్గకుండా కొడుతోంది. దీంతో వాతావరణశాఖ జిల్లా అంతటా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఎండ వేడితో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఉక్కపోతతో ఇండ్లలో ఉండలేక ఇబ్బంది పడుతున్నారు.
అత్యవసరమైతే తప్ప.. ప్రజలు బయటకురావడం లేదు. రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. మార్చి మూడోవారం వరకూ 39 డిగ్రీల ఉష్ణోగ్రత మించలేదు. నాలుగో వారంలో 40 డిగ్రీలు దాటింది. ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. వాతావారణంలో మార్పుల కారణంగా మబ్బులు పట్టి వానలు పడడంతో రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రత పెరగడం మొదలైంది.