యాదగిరిగుట్టలో వైభవంగా సీతారాముల ఎదుర్కోలు’ మహోత్సవం..ఇవాళ (ఏప్రిల్ 6న) సీతారాముల కల్యాణం

యాదగిరిగుట్టలో వైభవంగా సీతారాముల ఎదుర్కోలు’ మహోత్సవం..ఇవాళ (ఏప్రిల్ 6న) సీతారాముల కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీతారాముల వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం కొండపై ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో సీతారాముల ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం శివాలయం యాగ మండపంలో సీతారామ, హనుమత్  మూలమంత్ర జపాలు, దశశాంతి పంచసూక్త పారాయణాలతో అభిషేకం, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం నిర్వహించారు. సాయంత్రం నిత్యారాధనలు ముగిసిన అనంతరం సహస్రనామార్చనలు నిర్వహించి సీతారాముల ఎదుర్కోలు మహోత్సవాన్ని ప్రారంభించారు.

సీతారాములను పూలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఊరేగించారు. అనంతరం ముఖ మండపంలో సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతు జరిపించారు. అనంతరం సీతారాముల కల్యాణం కోసం ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం జరపడానికి ముహూర్తాన్ని ఫిక్స్  చేశారు. ఆలయ చైర్మన్  నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, శివాలయ ప్రధాన అర్చకులు నర్సింహరాములు, ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ ఉన్నారు.