
- జగన్మోహిని అలంకారం, అశ్వవాహనంపై ఊరేగిన నృసింహుడు
- నేడు లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో వేద పారాయణాలు, మంత్రోచ్ఛరణల నడుమ స్వామి, అమ్మవారి ఎదుర్కోలు జరిపారు. లక్ష్మీనారసింహుడిని ప్రత్యేకంగా అలంకరించి తూర్పు రాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అధిష్ఠింపజేసి ఎదుర్కోలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
స్వామి వారి తరఫున ఆలయ ఈవో భాస్కర్‌రావు, అమ్మవారి తరఫున చైర్మన్ నర్సింహమూర్తి పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదసంవాదాలు జరిపి, స్వామి, అమ్మవార్లు ఒకరికి ఒకరు నచ్చారని చెప్పడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం లక్ష్మీనరసింహుడి కల్యాణానికి శనివారం రాత్రి 8.45 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.
జగన్మోహినీ అలంకారంలో...
అలంకార సేవల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని జగన్మోహినీ అలంకారంలో ముస్తాబు చేశారు. సాయంత్రం అశ్వవాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేసి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు.
నేడు లక్ష్మీనారసింహుడి కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన లక్ష్మీనరసింహుడి తిరుకల్యాణానికి సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి 8.45 గంటలకు స్వామివారి కల్యాణం జరపనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. స్వామివారి కల్యాణం కోసం ప్రధానాలయానికి ఉత్తరం వైపున ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. సుమారు మూడు వేల మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, ప్రెస్, కల్యాణ భక్తులు, డోనర్లు, సాధారణ భక్తుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.