యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నుంచి 12 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొండపైన నారసింహుడి క్షేత్రానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శరన్నవరాత్రి పూజలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆలయ ఆఫీసర్లు కంప్లీట్ చేశారు. మరోవైపు నవరాత్రి పూజల్లో పాల్గొనే భక్తుల కోసం పలు రకాల టికెట్లను సైతం దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. నవరాత్రి పూజల్లో పాల్గొనడానికి వచ్చే భక్తులకు టికెట్ ధర రూ.1,116 గా నిర్ణయించారు.
ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఒక్కరోజు సప్తశతి పారాయణం పూజ కోసం రూ.116, ఒక్కరోజు లక్షకుంకుమార్చన పూజ కోసం రూ.116 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ టికెట్లపై ఒక్కరోజు మాత్రమే సప్తశతి పారాయణం, లక్షకుంకుమార్చన పూజలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3 నుండి 12 వరకు భక్తుల చేత నిత్యం నిర్వహించబడే రుద్రహోమంపూజను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఎములాడలో..
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయంలో నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు 9 రోజులపాటు రోజుకో అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ గోపురాలకు విద్యుత్ అలంకరణ, స్వామి వారి వాహనాలను సిద్ధం చేశారు. 10న దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి వద్ద చండీ కలశ ప్రతిష్ట, చండీహవనం, మహిషాసురు మర్దిని మహాపూజ, 12న విజయదశమి సందర్భంగా ఆయుధపూజ, స్వామివారి పెద్దసేవ నిర్వహించనున్నారు.
ముస్తాబైన శ్రీగిరి పర్వతం
రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలోని శ్రీ గిరి పర్వతం (గనెగుట్ట)పై ఉన్న శ్రీ కనక దుర్గ దేవి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. విజయవాడ కనకదుర్గ టెంపుల్ తర్వాత ఉత్తర తెలంగాణలో పర్వతంపై కొలువుదీరిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
బాసరలో శారదీయ నవరాత్రులు
బాసర, వెలుగు : బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ కానుండగా.. తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుండగా.. ప్రతి రోజు వేర్వేరు నైవేద్యాలు సమర్పిస్తారు. విద్యుద్దీపాలతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంటోంది. టీటీడీ సత్రం నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్లేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
బాసర గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. భారీగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రసాదాల కౌంటర్, అక్షరభ్యాస మండపాల వద్ద రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు అన్నదానం ఉంటుంది. బాసర ఆలయం,నాందేడ్‌కు చెందిన బాబాజీ జగదీశ్మహారాజ్గాడిపుర ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ఆధ్వర్యంలో ముథోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్ఐ గణేశ్ బందోబస్తు కొనసాగించనున్నారు.