నల్గొండ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

నల్గొండ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
  • యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట
  • కొమురవెల్లిలో పట్నాలు వేసి, మొక్కులు చెల్లించుకున్న భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్కూళ్లకు సమ్మర్‌‌ హాలీడేస్‌‌ కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం సందడిగా మారింది. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి అరగంట పట్టినట్లు భక్తులు తెలిపారు. మరోవైపు ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జరిపించిన నిత్య పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.34,93,088 ఆదాయం వచ్చింది. 

ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.15,00,030, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.4,67,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.5.40 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ సుంకరి రాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం 
కల్పించారు. 

కొమురవెల్లిలో...

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లన్న స్వామికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మల్లన్న గుట్టపైన కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. 

శ్రీ రామకొండకు పోటెత్తిన భక్తులు 

కోయిలకొండ, వెలుగు : మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోయిలకొండ సమీపంలో గల రామకొండ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం, అమావాస్య కావడంతో ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ గుట్టపై ఉన్న మొక్కలు అమావాస్య రోజు సంజీవనిగా మారుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్‌‌నగర్‌‌ ఎంపీ డీకే అరుణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.