పెండ్లి కొడుకైన నారసింహుడు.. అశ్వవాహనంపై ఊరేగింపు

 
  • వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం..జగన్మోహిని అలంకారంలో స్వామివారి దర్శనం
  •  అశ్వవాహనంపై ఊరేగింపు..నేడు లక్ష్మీనరసింహుల తిరుకల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం ఎదుర్కోలు మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యారాధనలు ముగిసిన తర్వాత స్వామి అమ్మవార్లను పూలతో అలంకరించి, మొదట అశ్వవాహనంపై ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు. తర్వాత ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా మండపంలో స్వామిఅమ్మవార్లను ఎదురెదురుగా అధిష్టింపజేశారు. స్వామివారి తరఫున ఆలయ ఈవో భాస్కర్ రావు, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి పెండ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతు నిర్వహించారు. ఇరువర్గాల మధ్య ఒప్పందాలు, చర్చల తర్వాత స్వామివారు మాకు నచ్చారని అమ్మవారి తరఫునవారు..అమ్మవారు తమకు కూడా నచ్చారని స్వామి తరఫున వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేదపండితులు సోమవారం రాత్రి 8:45 గంటలకు నరసింహుడి కల్యాణం నిర్వహించాల్సిందిగా సుముహూర్తం ఖరారు చేశారు. దీనికి ఇరువర్గాలవారు ఒప్పుకుని నిశ్చయ తాంబూలాలు మార్చకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారంలో హనుంత వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. రాత్రి 8:45 గంటలకు గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరింపజేసిన అనంతరం.. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆరంభించనున్నారు.

ఉత్తర దిశలో కల్యాణం

కల్యాణాన్ని ప్రధానాలయానికి ఉత్తరం వైపు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది తూర్పు వైపున స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడంతో.. స్థలం సరిపోక భక్తులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇప్పుడు 2500 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచారు. టికెట్ ధర రూ.3000 కాగా.. ఒక్క టికెట్ పై దంపతులిద్దరిని అనుమతిస్తారు. కల్యాణానికి ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ఆర్అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. అలాగే శ్రీలక్ష్మీనరసింహస్వామి టీటీడీ అధికారులు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ డీఈవో లోకనాథం, సూపరింటెండెంట్ సురేశ్​అర్చకులతో కలిసి స్వామివారికి పట్టుబట్టలు పెట్టారు.  జగన్మోహిని అలంకారంలో యాదాద్రీశుడు ఆదివారం ఉదయం నిత్యారాధనల తర్వాత ప్రధానాలయంలో జగన్మోహిని  అలంకార సేవ నిర్వహించారు. భూదేవీ సమేతుడైన నారసింహుడి ఆలయ మాడవీధుల్లో ఊరేగాడు.