యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో బూజు(ఫంగస్) ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన భక్తుడు బబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్ మంగళవారం సాయంత్రం ఫ్యామిలీతో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పాతగుట్ట నారసింహుడిని దర్శించుకుని రెండు లడ్డూలను కొన్నాడు.
ఇంటికి వెళ్లిన కవర్ లోంచి లడ్డూలను తీసి చూడగా బూజు వచ్చింది. దీంతో అతను దయచేసి బూజు పట్టిన లడ్డూలను భక్తులకు అమ్మవద్దంటూ.. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ యాదగిరిగుట్ట లడ్డూకు బూజు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ఫొటోలు వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు రిపీట్ కావొద్దంటే సంబంధిత ఆలయ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు భక్తుడు డిమాండ్ చేశాడు.