ఫస్ట్ జనవరికి యాదాద్రి రెడీ

  •     భక్తుల రద్దీ నేపథ్యంలో టైమింగ్స్ చేంజ్
  •     ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు
  •     60 వేల లడ్డూలను సిద్ధం చేసిన ఆలయ ఆఫీసర్లు

యాదగిరిగుట్ట, వెలుగు: న్యూ ఇయర్ కోసం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సిద్ధమైంది. సోమవారం జనవరి ఫస్ట్‌ నేపథ్యంలో  అధికారులు టెంపుల్‌ను రకరకాల పూలు, మామిడాకులు, కొబ్బరి తోరణాలతో  సర్వాంగ సుందరంగా అలంకరించారు.  బాహ్య, అంతర్ ప్రాకారాలు, ఆలయ మాడవీధులు, అష్టభుజి ప్రాకార మండపాలకు స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.  అంతే కాదు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో టెంపుల్ టైమింగ్స్ చేంజ్ చేశారు. 

ఆలయాన్ని ఉదయం 3 గంటలకు, పాతగుట్ట ఆలయాన్ని ఉదయం 4:30 గంటలకు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, అర్చనలు, అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం6:30 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. మధ్యలో బ్రేక్ దర్శనాలు, స్వామివారికి ఆరగింపు, నివేదన కైంకర్యాలు నిర్వహించనున్నారు.  60 వేల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు తయారుచేసి సిద్ధంగా ఉంచారు.  

భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టనున్నారు.  భక్తులు కొండపైకి రాకపోకలు సాగించడానికి ఉచిత ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

నారసింహుడి సేవలో హైకోర్టు జడ్జిలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ వినోద్ కుమార్, విజయసేన్ రెడ్డి దర్శించుకున్నారు. ఫ్యామిలీస్‌తో కలిసి ఆలయానికి వచ్చిన వారికి  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అద్దాల మండపంలో వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో రామకృష్ణారావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఆదివారం నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.42,00,353 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.