యాదగిరిగుట్ట, వెలుగు : ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం శనివారం నయనానందకరంగా జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో ఆలయ ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి అర్చకత్వంలో కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇప్పటివరకు 4న మెల్బోర్న్, 8న అడిలైడ్, 11న సిడ్నీలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించామని ఈవో గీతారెడ్డి చెప్పారు. శనివారం సిడ్నీలో నిర్వహించిన స్వామివారి కల్యాణ తంతుతో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిందన్నారు. కల్యాణంలో ఏఈవో గజవెల్లి రఘు, అర్చకులు శ్రీకాంత్, వేణు, సిడ్నీ ఎంపీ, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
విగ్రహాలకు అపచారం
కల్యాణం నిర్వహించడానికి యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లిన స్వామివారి విగ్రహాలకు అపచారం జరిగిందని, విగ్రహాలను కారులో డ్రైవర్ పక్కన సాధారణ మానవులు కూర్చునే సీటులో పెట్టడమే కాకుండా, సీటుబెల్టుతో బంధించారంటూ ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలను అర్చకుల సమక్షంలో ప్రత్యేక వాహనంలో తరలించాలే తప్ప.. సామాన్య మానవులు ప్రయాణించే కారులో ఎలా తరలిస్తారని భక్తులు సైతం తప్పు పడుతున్నారు. . ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్వామివారి విగ్రహాలను కొందరు వ్యక్తులు ముట్టుకుని దిగిన ఫొటోలు సైతం వివాదాస్పదంగా మారాయి. ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్వామివారి విగ్రహాలను నిష్టతో పూజలు చేసే అర్చకులు తప్ప సామాన్య మానవులు తాకకూడదు. కానీ ఇందుకు విరుద్ధంగా సిడ్నీలో ఓ ఇంట్లో పెట్టిన స్వామివారి విగ్రహాలను పట్టుకుని కొందరు వ్యక్తులు ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.