యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నారసింహుడి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నిత్య పూజల తర్వాత ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన నిర్వహించారు. పూలతో స్వామివారిని కాళీయమర్దన అలంకారంలో ముస్తాబు చేశారు. వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలు ధరించిన స్వామివారు కాళీయమర్థన శ్రీకృష్ణ అలంకారంలో ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి నిత్య కైంకర్యాలు ముగిసిన తర్వాత.. నృసింహ మూలమంత్ర హవనం, హనుమద్వాహం నిర్వహించారు.
అనంతరం యాదగిరీశుడిని రామావతారంలో నయనానందకరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆలయ వీధుల్లో విహరింపజేశారు. టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా జయంత్యుత్సవాలు జరిగాయి. బుధవారం ఉత్సవాలు ముగియనున్నాయి. డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు జూశెట్టి కృష్ణ గౌడ్, గజవెల్లి రమేశ్‌బాబు సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి ఉన్నారు.