యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం చివరి వారం కావడంతో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కల్యాణకట్ట, పుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. సత్యనారాయణస్వామి వ్రతాల్లో 376 మంది దంపతులు పాల్గొన్నారు. అలాగే శివాలయంలో భక్తులు రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో అర్చన నిర్వహించారు. అనంతరం ప్రధానాలయం, శివాలయం, విష్ణుపుష్కరిణి, వ్రతమండపం, లక్ష్మీపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లలో కార్తీక దీపాలు వెలిగించారు. మంగళవారం వివిధ రకాల పూజలు, నిత్యకైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.34,73,509 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. - యాదగిరిగుట్ట, వెలుగు
పుస్తకం మంచి స్నేహితుడితో సమానం
యాదాద్రి, వెలుగు : పుస్తకాలు మంచి స్నేహితులతో సమానమని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని లైబ్రరీని మంగళవారం ఆయన పరిశీలించి ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైబ్రరీల్లోని బుక్స్ ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏవో నాగేశ్వరాచారి, అమరేందర్‌గౌడ్, బండారు జయశ్రీ, కాచరాజు జయప్రకాశ్, లావణ్య, మధుసూదన్‌రెడ్డి, స్వామి ఉన్నారు.
బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి
కోదాడ/హుజూర్‌నగర్, వెలుగు : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ లైబ్రరీలో ఏర్పాటు చేసిన బుక్స్ ఎగ్జిబిషన్‌ను మంగళవారం ఎంఈవో సలీం షరీఫ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లను లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీం, నాయకులు పోటు రంగారావు, ప్రధాన కార్యదర్శి మెట్టెల నరేశ్, గరిడేపల్లి లక్ష్మణరావు, బషీరుద్దీన్, తాజుద్దీన్ పాల్గొన్నారు. అలాగే హుజూర్‌నగర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బుక్స్ ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపాల్ భీమార్జున్‌రెడ్డి ప్రారంభించారు.
నేడు పీఎంఈజీపీపై అవగాహన సదస్సు
సూర్యాపేట, వెలుగు: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకంపై బుధవారం సూర్యాపేటలోని ఎంపీడీవో ఆఫీస్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్పత్తి రంగంలో రూ.50 లక్షల వరకు, సేవా రంగంలో రూ. 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టే ఆసక్తి ఉన్న యువతీయువకులు ఈ సదస్సుకు హాజరుకావాలని సూచించారు. పీఎంఈజీపీ పథకంలో 15 శాతం నుంచి 35 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చన్నారు.
ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : ఫుడ్ వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లైసెన్స్ తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ యాదాద్రి జిల్లా ఆఫీసర్ పి.స్వామి సూచించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకపోతే ఆరు నెలల జైలుశిక్షతో పాటు, రూ. ఐదు లక్షల ఫైన్ విధించనున్నట్లు హెచ్చరించారు. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో మంగళవారం ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైసెన్స్ తీసుకున్న వారు రూల్స్ పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని సూచించారు. భీమనపల్లిలోని పాల వ్యాపారులు ఎక్కువగా ఫుడ్ లైసెన్స్ తీసుకున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నల్గొండ జోన్ ఆఫీసర్ జ్యోతిర్మయి ఉన్నారు.
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
సూర్యాపేట, వెలుగు : ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సూర్యాపేట జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బెల్లంకొండ శ్రీధర్‌గౌడ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో సాగవుతున్న ఆయిల్‌పామ్ తోటలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్, మొక్కల పెంపకానికి సబ్సిడీలు ఇస్తున్నట్లు చెప్పారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆఫీసర్లు వి.స్రవంతి, కన్నా జగన్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శశికుమార్, రంగు ముత్యంరాజు, గంధసిరి భద్రాచలం పాల్గొన్నారు.
‘రైతులకు మద్దతు ధర ఇస్తున్నాం’
మిర్యాలగూడ, వెలుగు : మిల్లులకు సన్నొడ్లు తీసుకొస్తున్న రైతులకు మెరుగైన ధర చెల్లిస్తున్నామని మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో సన్నొడ్ల సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, అక్కడి నుంచి వడ్లను దిగుమతి చేసుకోవడం లేదని చెప్పారు. క్వాలిటీ వడ్లు తీసుకొచ్చిన రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గుడిపాటి శ్రీనివాస్, కార్యదర్శులు బోగవెల్లి వెంకటరమణచౌదరి, రంగా లింగయ్య, ట్రెజరర్ పైడిమర్రి సురేశ్ పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
సూర్యాపేట, వెలుగు : తమ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు సూర్యాపేట – దంతాలపల్లి హైవేపై రాస్తారోకో నిర్వహించారు. గతంలో అక్రమాలు జరిగాయంటూ కేంద్రాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 100 మంది రైతులు గంటపాటు ఆందోళనకు దిగడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై యాదవేందర్‌రెడ్డి రైతుల వద్దకు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఫయాజ్, ఇరుగు మధుకర్, మందడి పిచ్చిరెడ్డి, ఉపేందర్, గుండాల వెంకన్న, దేవయ్య, మల్లయ్య, ఇరుగు వెంకన్న పాల్గొన్నారు.
ఎక్కువ తూకం వేస్తున్నారని రైతుల ఆగ్రహం
వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎక్కువ తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం తరుగుతో కలుపుకొని ఒక్కో బస్తాను 41 కేజీల తూకం వేయాలి. కాని పాత సూర్యాపేట వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 200 గ్రాములు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రైతులు మంగళవారం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో వారు కేంద్రానికి వచ్చి వివరాలు సేకరించారు. 41 కేజీల కంటే ఎక్కువ తూకం వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాలు పేరుతో రైతులను దోచుకుంటున్రు
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : రైస్ మిల్లర్లు, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి రైతులను దోచుకుంటున్నారని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. భూదాన్‌పోచంపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాలు పేరుతో క్వింటాల్ వడ్లకు రెండున్నర కిలోలు తీస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో బస్తాకు కిలో తూకం వేస్తుంటే పోచంపల్లిలో మాత్రం 60 గ్రాములు ఎందుకు ఎక్కువ వేస్తున్నారని ప్రశ్నించారు. పోచంపల్లి మండలంలో అధికార పార్టీ లీడర్లకు రైస్‌మిల్లులు ఉండడంతో వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రూల్స్ మేరకు వడ్ల తూకం వేయాలని, లేకపోతే అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటివరకు 30 శాతం వడ్లు మాత్రమే తూకం వేశారన్నారు. వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు.
బాలలకు భరోసా ఇవ్వాలి
సూర్యాపేట, వెలుగు : లైంగిక దాడులకు గురవుతున్న చిన్నారులకు భరోసా కల్పించాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. దాడులకు గురైన బాలల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట పోలీస్ మహిళా భరోసా సెంటర్ సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన మహిళలు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజీ సేవలు ఒకే చోట అందించడం, బాధితులకు ధైర్యం, భద్రత కల్పించడం కోసం పోలీస్ మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాడులకు గురవుతున్న బాలల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని, వారిలో అభద్రతాభావం ఏర్పడకుండా చూడాలన్నారు. లైంగిక దాడులకు గురైన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్స్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ మమత రఘువీర్, మహిళా, శిశు భద్రతా పోలీస్ విభాగం అదనపు ఎస్పీ అశోక్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ రాంరెడ్డి, డీసీపీవో రవికుమార్
పాల్గొన్నారు.
25న ‘పార్లమెంట్ మార్చ్’
యాదగిరిగుట్ట, వెలుగు : కొత్త విద్యా విధానం రద్దు, విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 25న ‘పార్లమెంట్ మార్చ్’ నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల దేశంలో సుమారు 200 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడి, కోట్లాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014కు ముందు దేశంలో 4.6 శాతం ఉన్న నిరుద్యోగ రేటు.. మోడీ ప్రధాని అయ్యాక 13.6 శాతానికి పెరిగిందన్నారు. భగత్‌సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్, నాయకులు కొండూరి వెంకటేశ్, ఎండీ.నహీం, బత్తుల శ్రీను, శేఖర్‌రెడ్డి, కంబాల వెంకటేశ్ తదితరులు
పాల్గొన్నారు.