ఐతారం కిటకిటలాడిన యాదాద్రి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గుట్టపైన, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, రింగు రోడ్డు భక్తులతో నిండిపోయాయి. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్ బ్లాకులు సందడిగా మారాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల కారణంగా నరసింహుడిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయంలో  స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు.

ప్రసాదంతో రూ.25 లక్షల ఆదాయం

పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయానికి ఆదివారం భారీగా ఆదాయం సమకూరింది. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.56,95 లక్షలు ఇన్ కమ్ వచ్చింది. అత్యధికంగా ప్రసాదం అమ్మకాల ద్వారా రూ.25,64,350, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5.50 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5.13 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.4,80,550, బ్రేక్ దర్శనాలతో రూ.4,66,200, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.4.20 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రత పూజల ద్వారా రూ.2.53 లక్షలు, ప్రచార శాఖతో రూ.1,58,250, సువర్ణ పుష్పార్చనతో రూ.1,37,200 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు. ఆదివారం వీఐపీ టికెట్లతో 2,800 మంది, బ్రేక్ దర్శన టికెట్లతో 1,554 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.