యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు నిర్ధారణ కావడంతో వేటు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపీ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. రూల్స్ కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశాడని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్టు డిస్ట్రిక్ట్  రిజిస్ట్రార్ హరికోట్ల రవి బుధవారం తెలిపారు. జిల్లాలోని కొలనుపాక రెవెన్యూ పరిధి సర్వే నం.472, 473లోని వెంచర్ లో 154  ప్లాట్లను నిబంధనలు ఉల్లంఘించి సబ్ రిజిస్ట్రార్ గోపీ నాయక్ రిజిస్ట్రేషన్లు చేశారని మంగళవారం కమిషనర్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి, ఆడిట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ టీమ్  బుధవారం గుట్టలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేసింది. 

గత డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ గోపీ నాయక్ రూల్స్ ఉల్లంఘించి 154 ప్లాట్లను నాన్ లే అవుట్ కింద  రిజిస్ట్రేషన్ చేసినట్లు  నిర్ధారించి కమిషనర్ కు రిపోర్ట్ చేసింది. దాని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గోపీ నాయక్ ను సస్పెండ్​  చేశారు.  తదుపరి రిజిస్ట్రేషన్ ట్రాన్జాక్షన్స్ జరగకుండా 154 ప్లాట్ల డాక్యుమెంట్లను ప్రొహిబిటెడ్  లిస్ట్ లో పెట్టామని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి తెలిపారు.