వెన్నకృష్ణుడిగా నారసింహుడు

 వెన్నకృష్ణుడిగా నారసింహుడు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు వెన్నకృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనలు ముగిసిన అనంతరం నారసింహుడిని వెన్నకృష్ణుడిగా అలంకరించి, ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం ప్రధానాలయంలో మూలవరులకు నిత్యపూజలు చేసి, స్వామివారిని కాళీయమర్ధనుడిగా తీర్చిదిద్ది మాఢవీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌‌ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌‌రావు పాల్గొన్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారిని వటపత్రశాయి, వైకుంఠనాథుడిగా అలంకరించనున్నారు. 

స్వామివారిని దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్‌‌

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని సోమవారం అసెంబ్లీ స్పీకర్‌‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, గర్భాలయంలో స్వయంభునారసింహుడిని దర్శించుకొని, ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భాస్కర్‌‌రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. 

అనంతరం స్పీకర్‌‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేలా సీఎం రేవంత్‌‌రెడ్డికి, ప్రభుత్వానికి శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలన్నదే సీఎం సంకల్పమన్నారు. స్పీకర్ హోదాలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు, రైతులు పాడిపంటలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.