నల్గొండ: యాదగిరిగుట్ట ఆలయ కేంద్రంగా హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. యాదగిరిగుట్ట ఆలయం పైన మాడవీధుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు సంకల్పం చేయడంపై ఆలయ ఈవో భాస్కర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ ఆలయ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయంటూ ఈవో భాస్కర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకుని మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆగస్ట్ 15లోగా అన్న మాట ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్, పూర్తిగా చేయలేదని బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి మాట తప్పారని గుట్ట సాక్షిగా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. భక్తులకు హాని కలగొద్దని పూజలు చేసినట్లు చెప్పారు. ఆలయాలకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని దేవుళ్లకు పూజలు చేస్తానని హరీష్ రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. ఇవాళ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ పూజలపై ఆలయ ఈవో అభ్యంతరం వ్యక్తం చేయడంతో యాదగిరిగుట్ట సాక్షిగా తెలంగాణ రాజకీయాలు హాట్హాట్గా మారాయి.