- ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
- లోక్సభ ఎన్నికలు ముగియగానే పాలక మండలి ఏర్పాటుకు నిర్ణయం ?
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ లో టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లోనే పాలక మండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించినా.. లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. దీంతో జూన్ 4న ఎన్నికల కోడ్ ముగియగానే.. జూన్ రెండో వారంలోనే ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది.
దశాబ్దంన్నర తర్వాత పాలక మండలి.?
యాదగిరిగుట్ట నర్సన్న ఆలయానికి దాదాపుగా దశాబ్దంన్నర నుంచి పాలక మండలి లేదు. చివరిసారిగా 2008లో ఏర్పడిన ట్రస్ట్ బోర్డ్ 2010 వరకు కొనసాగింది. 2010 నుంచి 2024 వరకు దాదాపుగా 14 ఏండ్ల నుంచి పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలక మండలి ఊసే ఎత్తలేదు. దాదాపుగా రూ.1,250 కోట్లతో స్వయంగా ప్రభుత్వం చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం కూడా పాలక మండలి లేకుండానే జరిగింది.
దీంతో ఆలయ అభివృద్ధిలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పాలక మండలి ఏర్పాటు చేస్తే అవినీతి, అక్రమాలకు తావుండదని, అందుకే కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదని అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే(2008-–2010) చివరిసారిగా పాలక మండలి ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 2023 డిసెంబర్ లో అధికారంలోకి రావడంతో పాలక మండలి ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలక మండలి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాలక మండలి ఏర్పాటు చేస్తేనే ఆలయ నిర్వహణ పారదర్శకంగా సాగుతుందని పలుమార్లు అధికారిక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పాలక మండలి ఏర్పాటుపై ప్రభుత్వం సన్నాహాలు షురూ చేసింది.