- నేటి నుంచి డిసెంబర్ 1 వరకు ప్రత్యేక పూజలు
- పాత, ప్రధాన ఆలయంలో 11 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణ
- 15న కార్తీక పౌర్ణమి రోజున అదనంగా 3 బ్యాచ్‌లు
- ఆన్‌లైన్‌లోనూ వ్రత టికెట్ బుక్ చేసుకునే చాన్స్
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాస పూజలకు యాదగిరిగుట్ట సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా బ్యాచ్‌ల సంఖ్యను పెంచడంతో పాటు, ఆన్‌లైన్‌లోనూ టికెట్ల బుకింగ్‌కు చాన్స్ కల్పించారు.
11 బ్యాచ్‌లలో వ్రతాల నిర్వహణ
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే అత్యధికంగా జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా వ్రత మండపాన్ని సిద్ధం చేయడంతో పాటు వ్రతాల నిర్వహణ బ్యాచ్‌ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం రోజుకు నాలుగు బ్యాచ్‌లలో వ్రతాలు నిర్వహిస్తుండగా శనివారం నుంచి డిసెంబర్ ఒకటి వరకు ప్రతి రోజూ 6 బ్యాచ్‌లలో వ్రతాలు నిర్వహించనున్నారు.
ఇందుకోసం వ్రత మండపంలో ఉన్న రెండు హాళ్లను రెడీ చేశారు. ఒక్కో హాల్‌లో ఒకే సమయంలో సుమారు రెండు వేల మంది దంపతులు వ్రతాలు నిర్వహించు కునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 6 బ్యాచ్‌లలో వ్రతాలు నిర్వహించనున్నారు.
అలాగే అనుబంధ ఆలయమైన పాతగుట్టలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం ఐదు బ్యాచ్‌లలో వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో వ్రతాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నందున ఆ రోజు ప్రధాన ఆలయంలో బ్యాచ్‌ల సంఖ్యను మరింత పెంచారు.
ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 8 బ్యాచ్‌లలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించ నున్నారు. అలాగే పాతగుట్టలో ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు బ్యాచ్‌లలో వ్రతాలు నిర్వహిస్తారు. రూ. 800 టికెట్ చెల్లిస్తే పూజా, పాత్ర సామగ్రిని ఆలయ సిబ్బందే నేరుగా వ్రత పీఠల వద్దకు సరఫరా చేయనున్నారు.
ఆన్‌లైన్‌లోనూ వ్రతాల టికెట్లు
యాదగిరిగుట్టలో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతాల టికెట్లను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచారు. యాదగిరిగుట్ట దేవస్థాన అఫీషియల్ వెబ్‌సైట్ yadadritemple.telangana.gov.inలో లాగిన్ అయి రూ. 800 చెల్లించి వ్రత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
కార్తీక దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
కార్తీక మాసంలో భక్తులు శివకేశవులను దర్శించుకున్న అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఇందుకోసం యాదగిరి కొండ పైన, కొండ కింద ఏర్పాట్లు చేశారు.
కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం ఎదుట, హనుమాన్ టెంపుల్ వద్ద, కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి, పాతగుట్ట వద్ద కార్తీక దీపాలు వెలిగించేలా చర్యలు చేపట్టారు.