వైభవంగా సంప్రోక్షణ పూజలు

వైభవంగా సంప్రోక్షణ పూజలు
  • స్వర్ణకలశాలకు ఛాయాధివాసం నిర్వహించిన అర్చకులు
  • యాదగిరిగుట్టకు చేరుకున్న నదీ జలాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్యవిమాన స్వర్ణగోపుర ‘మహాకుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం యాగశాలలో ‘పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగాన్ని’ నిర్వహించారు. ఉదయం స్వామివారిని ప్రధానాలయం నుంచి తిరువీధి సేవ ద్వారా యాగశాల ప్రదేశానికి తీసుకువచ్చి వేదపండితులు మంత్రోచ్ఛారణలు, వేద ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణాలు చేశారు.

 అనంతరం మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన మంత్రపుష్పం, శాత్తుమరై వంటి పూజలు జరిపించారు. సాయంత్రం ప్రధానాలయంలో స్వామివారికి నిత్యారాధన ముగిసిన అనంతరం ఛాయాధివాసం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ గోపురాలపై ఏర్పాటు చేసే స్వర్ణ కలశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు పవిత్రమైన జలం, పాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు యాగశాలలో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తిమంత్ర హోమాలు వరుణానువాక హోమం జరిపించారు.

నారసింహుడి చెంతకు చేరిన ‘నదీజలాలు’

ఈ నెల 23న దివ్యవిమాన స్వర్ణగోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్న నేపథ్యంలో దేశంలోని వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు గురువారం యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకున్నాయి. వెండి కలశాలలో సేకరించి తెచ్చిన నదీజలాలను యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభంలో పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నదీ జలాలకు 23 వరకు ప్రత్యేక పూజలు జరిపి మంత్ర పూరితం చేసిన అనంతరం దివ్యవిమాన స్వర్ణగోపురానికి కుంభాభిషేకం, సంప్రోక్షణ చేయనున్నారు.

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీసీపీ

దేవస్థానంలో జరుగుతున్న కుంభ సంప్రోక్షణ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో గురువారం యాదగిరిగుట్ట క్షేత్రంలో భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఏసీపీ రమేశ్ కుమార్, సీఐ రమేశ్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఈవో రఘుతో కలిసి యాగశాల, ఉత్తర ద్వారం, ప్రధానాలయం, తూర్పు ద్వారం, క్యూలైన్లు సహా పలు ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.