యాదగిరిగుట్ట టెంపుల్ రికార్డ్‌‌ అసిస్టెంట్‌‌ సస్పెన్షన్‌‌

యాదగిరిగుట్ట టెంపుల్ రికార్డ్‌‌ అసిస్టెంట్‌‌ సస్పెన్షన్‌‌
  • ఆలయానికి చెందిన డబ్బులను సొంతానికి వాడుకున్నట్లు గుర్తింపు
  • తిరిగి కట్టాలని ఆదేశించిన ఆఫీసర్లు.. స్పందించని ఉద్యోగి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ రికార్డ్‌‌ అసిస్టెంట్‌‌ నర్సింగరావుపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. నర్సింగరావు కొన్నేండ్లుగా ఘాట్‌‌ రోడ్డు గుండా కొండపైకి వెళ్లే వాహనాలకు టికెట్లు జారీ చేసే కౌంటర్‌‌లో డ్యూటీ చేస్తున్నాడు. రూల్స్‌‌ ప్రకారం ఒక్కో వాహనానికి రూ. 500 తీసుకొని, రోజు మొత్తంలో వచ్చిన డబ్బులను అదేరోజు బ్యాంక్‌‌లో చలానా కట్టి దేవస్థానానికి సంబంధించిన అకౌంట్‌‌లో డిపాజిట్‌‌ చేయాలి. అయితే రికార్డ్‌‌ అసిస్టెంట్‌‌ నర్సింగరావు రూ.58 వేల పైచిలుకు డబ్బులు తక్కువ డిపాజిట్‌‌ చేసినట్లు ఆలయ ఆఫీసర్ల దృష్టికి వచ్చింది. 

దీంతో ఆ అమౌంట్‌‌ను కట్టాలని ఆఫీసర్లు ఆదేశించగా.. రెండు రోజుల నుంచి డ్యూటీకి రాకపోగా, ఫోన్‌‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో నర్సింగరావును సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో భాస్కర్‌‌రావు సోమవారం ఆర్డర్స్‌‌ జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అవకతవకలకు పాల్పడితే ఏ స్థాయి అధికారికైనా ఉపేక్షించేది లేదని ఈవో హెచ్చరించారు.