కొండంతా జనమే.. వరుస సెలవులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట

కొండంతా జనమే.. వరుస సెలవులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
  • ధర్మ దర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం
  • వేములవాడకు భారీగా తరలివచ్చిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సోమవారం భక్తులతో నిండిపోయింది. ఉగాది, రంజాన్‌‌‌‌ సందర్భంగా వరుస సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు.. కొండపైన బస్ బే, ప్రొటోకాల్ ఏరియా, దర్శన, ప్రసాద క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో కొండపైన పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ పూర్తిగా నిండిపోయింది.

కొండపైన ఉన్న బస్‌‌‌‌ బే ప్రాంగణం, ప్రొటోకాల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ పక్కన ఉన్న పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు సైతం నిండిపోవడంతో వాహనాలు కొండపైకి రాకుండా కిందే ఆపేశారు. దీంతో భక్తులు ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. రద్దీ కారణంగా దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్‌‌‌‌ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 

ఒక్కరోజే రూ.66.44 లక్షల ఇన్‌‌‌‌కం
యాదగిరిగుట్టకు ఈ ఒక్కరోజే రూ.66,44,697 ఆదాయం వచ్చింది.  ఇందులో ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.18,45,410, వీఐపీ దర్శనాలతో రూ.11.25 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8,52,500, బ్రేక్‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.4,63,800, ప్రధాన బుకింగ్‌‌‌‌ ద్వారా రూ.2,83,350, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,65,600 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

కిటకిటలాడిన వేములవాడ
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానం చేసి స్వామి వారి దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటలు పట్టింది. అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

వేములవాడ అనుబంధమైన భీమేశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. మరో వైపు వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్‌‌‌‌ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చన నిర్వహించారు.