
- నిర్మాణానికి రూ. 23.79 కోట్లు కేటాయింపు
- వైటీడీఏ నుంచి 15 ఎకరాలు ఆలయానికి బదిలీ
- ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించనున్న ప్రభుత్వం
యాదగిరిగుట్ట, వెలుగు: త్వరలోనే యాదగిరిగుట్టలో వేద పాఠశాల ఏర్పాటు చేయనుండగా ప్రభుత్వం సన్నాహాలు షురూ చేసింది. ఆధ్యాత్మికతతో కూడిన ఆధునిక వసతులతో నిర్మించనుంది. ఇందుకు రూ.23.79 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ జీవో 124 ను జారీ చేసింది. ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పూర్తి చేయగానే వేద పాఠశాల నిర్మాణానికి పనులు ప్రారంభిస్తారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రాయగిరిలో వేద పాఠశాల నిర్మించాలని నిర్ణయించింది. కాగా గుట్టలోనే నిర్మిస్తే వేద విద్య అభ్యసించే విద్యార్థులకు అనుకూలంగా ఉండడమే కాకుండా ఆధ్యాత్మికత భావన పెంపొందించవచ్చని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా గుట్టలోనే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
టెంపుల్ సిటీలో హెలీప్యాడ్ సమీపంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమి వైటీడీఏ పరిధిలో ఉండడంతో.. భూ బదిలీకి అడ్డంకిగా మారింది. దీనిపై ఆలయ ఈవో భాస్కర్ రావు స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరించారు. వేద పాఠశాలకు టెంపుల్ సిటీలో 15 ఎకరాల స్థలాన్ని అప్పగించాల్సిందిగా వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించిన వైటీడీఏ భూ సర్వే రిపోర్టును ఆలయ ఈవోకు అందించగా ప్రభుత్వానికి పంపించారు. దీంతో వేద పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పాఠశాల పనులు మొదలవుతాయి.
అక్కడే సంస్కృత పాఠశాల కూడా..
దేవస్థానం ఆధ్వర్యంలో గుట్టకింద సంస్కృత పాఠశాలను కూడా వేద పాఠశాల ప్రదేశానికి తరలించడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రెండూ ఒకేచోట ఉంటే విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. వేద విద్య, సంస్కృత విద్యను ఏకకాలంలో నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉండటమే కాకుండా, ప్రయాణపరమైన ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు. ఇందుకు ఆలయ ఈవో భాస్కర్ రావు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపినట్లు తెలిసింది.
దేవస్థానం ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే.. వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఒకేచోట ఏర్పాటై విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. టెండర్ల ప్రక్రియ కంప్లీట్ కాగానే పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసి వేద పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని దేవస్థానం ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు.