
- నారసింహుడి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు
- వేములాడకు 20 రోజుల్లో..రూ. 1.95 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ. 4.43 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 65 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్‌కు తరలించి లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ.4,43,04,995లతో పాటు 296 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి వచ్చిందని ఈవో భాస్కర్‌రావు చెప్పారు.
హుండీలలో విదేశీ కరెన్సీ సైతం భారీ మొత్తంలో వచ్చిందన్నారు. ఇందులో అమెరికా డాలర్లు 1,582, ఇంగ్లాండ్ పౌండ్లు 10, యూఏఈ దిర్హామ్స్ 115, నేపాల్ రూపీస్ 80, కెనడా డాలర్లు 260, సౌదీ అరేబియా రియాల్స్ 100, సింగపూర్ డాలర్లు 10, ఆస్ట్రేలియా డాలర్లు 585, ఖతార్ రియాల్స్ 250, థాయ్‌లాండ్ భాట్స్ 40, ఒమన్ భైసా 803, శ్రీలంక రూపీస్ 150, కెనడా డాలర్స్ 260, మలేషియా రింగెట్స్ 17, ఇండోనేషియా రూపియా లక్ష, న్యూజిలాండ్ డాలర్లు 50, యూరోస్ 20, భూటాన్ 160, క్రోనర్ 120, మారిషస్ 100, పోలండ్ 10 పౌండ్లు, నిప్పన్ 1000 కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 20 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో లెక్కించారు. మొత్తం 1,95,75,000 రూపాయలతో పాటు 287 గ్రాముల బంగారం, 18.500 కిలోల వెండి వచ్చినట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆరు నెలల్లో హుండీ ద్వారా రూ. 11,47,510 వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు.