
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవాలకు సిద్దమవుతోంది. ఇందుకోసం కొండపైన ఉన్న అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 23 నుంచి 28 వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. శివాలయంలో ఈనెల 23న స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం.. ఆదివారం ఉదయం 11:30 గంటలకు స్వస్తివాచనంతో శివరాత్రి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాలైన 25న రాత్రి 7 గంటలకు రామలింగేశ్వరస్వామి కల్యాణం, 26న రాత్రి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాలు, 27న లక్షబిల్వార్చన, రథోత్సవం జరపనున్నారు. ఇక 28న నిర్వహించే మహాపూర్ణాహుతి, డోలోత్సవంతో శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
మహాశివరాత్రి జాతరకు పటిష్ట బందోబస్తు
మేళ్లచెరువు, వెలుగు : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెరువులో ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు జరిగే జాతరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శుక్రవారం స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల భద్రతకు 600 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 65 సీసీ కెమెరాలతో 24 గంటలు జాతరను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. జాతర నిర్వహణ రూట్ మ్యాప్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.