యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని గండిచెరువు అలుగు పారడంతో సోమవారం గుట్టలోని యాదగిరిపల్లికి వెళ్లే రోడ్డు జలమయమైంది. భారీగా నీరు చేరడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏరియా చెరువును తలపించింది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా స్థానిక ఊర చెరువును పూడ్చివేసిన అధికారులు వరదనీరు దిగువకు వెళ్లేలా కాలువను ఏర్పాటు చేయలేదు. గండి చెరువు నుంచి ఊర చెరువు ఉండే స్థలం వరకు పైపులు ఏర్పాటు చేసి వదిలేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గండిచెరువు నిండి సోమవారం అలుగు పోసింది.
వరద వెళ్లేందుకు దారిలేక యాదగిరిపల్లి మెయిన్ రోడ్డుపై ప్రవహించింది. యాదగిరిగుట్ట నుంచి యాదగిరిపల్లి మీదుగా వంగపల్లి, పెద్దకందుకూరు, మైలారుగూడెం, తాళ్లగూడెం, బాహుపేట, ఆలేరు వైపుకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు రింగు రోడ్డు మీదుగా పీహెచ్సీ వైపు చుట్టూ తిరిగి వెళ్లారు.
ఊరచెరువును పూడ్చిన అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గండిచెరువును ఇరిగేషన్ డీఈ బాలకృష్ణ, ఏఈ అశోక్ పరిశీలించారు.తూము గేట్లను ఎత్తి అలుగు బంద్ అయ్యేలా చర్యలు చేపట్టారు.