జిల్లా అధ్యక్ష పదవుల్లో యాదవులకు అన్యాయం

జిల్లా అధ్యక్ష పదవుల్లో యాదవులకు అన్యాయం
  • బీజేపీ స్టేట్​ఆఫీసును ముట్టడించిన యాదవ నేతలు

బషీర్ బాగ్, వెలుగు: జిల్లా అధ్యక్ష పదవుల్లో బీజేపీ తమకు తీవ్ర అన్యాయం చేసిందని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మండిపడ్డారు. 33 జిల్లాల్లో ఒక్క అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు పోరాట సమితి అధ్వర్యంలో బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. జై యాదవ్.. జై జై యాదవ్.. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

రాములు యాదవ్ తోపాటు సమితి అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కుంటే శంకర్ యాదవ్ ను అబిడ్స్ పోలీసులు అడ్డుకుని, బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ రాములు యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వెన్నంటి ఉన్న యాదవులను పదవులకు దూరం పెట్టడం సబబు కాదన్నారు. బీజేపీ హైకమాండ్​పునరాలోచించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.