యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు:  5వ రోజు శ్రీ కృష్ణాలంకారంలో స్వామి వారు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ కృష్ణాలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం పొన్నవాహన అలంకార సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 

ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.