యాదాద్రిలో దంచి కొట్టిన వాన... కొట్టుకు పోయిన పార్కింగ్ వాహనాలు

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రిలో వర్షం బీభత్సం గురువారం ( జూన్22)  సృష్టించింది. అయితే ఘాట్ రోడ్డులో వరద నీరు నిలిచిపోయింది. ఫలితంగా పార్కింగ్ స్థలంలో వాహనాలు వర్షపు నీటిలో మునిగడంతో  భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యాదాద్రిలో వర్షం కురిసింది. గురువారం ( జూన్22)   రెండు గంటల పాటు కుండపోతగా పడింది. ఫలితంగా గుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. అయితే యాదాద్రి కొండపై నుంచి కిందికి కొత్తగా నిర్మించిన రోడ్డు మార్గం వర్షపు నీటితో నిండిపోయింది. పార్కింగ్ ప్రాంతం చెరువును తలపిస్తుంది. మోకాళ్ల లోతులో నీరు ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   మరోవైపు కొండపై క్యూకాంప్లెక్స్‌లోకి కూడా వర్షపు నీరు చేరింది. ఇక పలువురు భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక యాదగిరిగుట్ట బస్టాండ్‌ ప్రాంగణం వర్షపు నీళ్లతో నిండిపోయింది.   

తాజా పరిణామాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. చిన్నపాటి వర్షానికే వాహనాలు మునగడంతో  భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  పార్కింగ్ పేరుతో గంటకు రూ.500 వసూలు చేయటంపై దృష్టి పెట్టిన అధికారులు.. ఇలాంటి వాటిపై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.