Article 370 Trailer Review: ఆసక్తిగా ఆర్టికల్ 370 ట్రైలర్..మొత్తం కశ్మీర్..భారతదేశంలో అంతర్భాగమే!

కాశ్మీర్ హింస‌, తీవ్ర‌వాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370(Article 370) మూవీ ఇందుకు భిన్నం. ఎట్టకేలకు సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ అవతారంలో యామి గౌతమ్ (Yami Gautam) ఆకట్టుకుంటోంది.

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఆర్టికల్ 370 పల్స్-పౌండింగ్ ట్రైలర్ ఆసక్తి కలిగిస్తుంది. జిహాదీ పేరుతో క‌శ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారంపై..అలాగే జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది.  

అంతేకాకుండా ట్రైలర్లో రాజ‌కీయ కుట్ర‌లు, కుతంత్రాలు, తీవ్ర‌వాదం చుట్టూ జరిగే సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. జము కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల..ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా ఉన్న యామి గౌతమ్ విధులకు తరుచూ ఆటంకం ఏర్పడుతుంటుంది. ఇక ఎలాగైనా ఘర్షణలను అరికట్టేందుకు కూడా ఈ 370 అధికరణ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఆర్టికల్ 370 అధికరణను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను..ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. ఇక ట్రైలర్ చివర్లో “మొత్తం కశ్మీర్..భారత దేశంలో అంతర్భాగమే..ఎప్పటికీ అలాగే ఉంటుంది” అనే డైలాగ్ అంచనాలు పెంచేసింది. 

యామి గౌతమ్ యుద్ధం సినిమాలో త‌రుణ్‌- శ్రీ‌హ‌రి లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించింది. తెలుగులో ఈ భామ కెరీర్ ఆశించిన స్థాయిలో వెల‌గ‌లేదు. కానీ బాలీవుడ్‌లో విక్కీ డోన‌ర్, కాబిల్ లాంటి సినిమాల‌తో న‌టిగా నిరూపించుకుని కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో ప్రియమణి, వైభవ్, తత్వవాది, అరుమ్ గోవిల్, రాజ్ అరుణ్, స్కంద ఠాకూర్ తదితరులు నటించారు. 

రెండుసార్లు జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక..ఎటువంటి ప్రశంసలు..విమర్శలు అందుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 370 కి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఆదిత్య ధర్, మోనాల్ థాకర్ అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. 

జమ్ము కశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. దీంతో జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక స్టేటస్‍ను ఎత్తేస్తూ..భారత ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ చాలా విధాలుగా నిరసనలు జరిగాయి. అయితే, కొన్నాళ్లకు శాంతి భద్రతలను..కొంతమేరకు స్వేచ్ఛను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. ఈ అంశంపైనే  ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

  • Beta
Beta feature