2024 సార్వత్రిక ఎన్నికలు సంపిస్తున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది.సాధ్యమయ్యే హామీలే ఇస్తామంటూ వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నగదు పెంచి మేనిఫెస్టో రూపొందించగా, వైసీపీ కంటే ఎక్కువ జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో రూపొందించింది టీడీపీ. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమి మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యమైనదే అని, ఒక్క వైసీపీ తప్ప ప్రజలంతా మేనిఫెస్టోను మెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ మేనిఫెస్టో వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఈ వినాశనం నుండి రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకే కూటమి మేనిఫెస్టో రూపొందించిందని యనమల అన్నారు.
ఇది పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టో అని, రాష్ట్రంలో అనవసర ఖర్చు తగ్గించుకుంటే 2వేల నుండి 3వేల కోట్ల వరకు ఆదాయం మిగులుతుందని అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టడం ద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఎన్డీయే కూటమికి మద్దతిస్తుంది కాబట్టి కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు.