కూసుమంచి, వెలుగు : కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన యరబోలు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్ డాక్టర్ జి. మల్సూర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు నూతన కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన గుదిమళ్ల మధు, చెన్నారం గ్రామానికి చెందిన జోగుపర్తి కృష్ణారావుతో పాటు షుగర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వై. కోటయ్యను, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.అప్పారావును సభ్యులుగా నియమించారు. యరబోలు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చక్కెర కార్మాగారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.