4 లక్షల ఎకరాలకు చేరిన యాసంగి సాగు

  • మొదటి స్థానంలో నాగర్​ కర్నూల్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు ఇప్పుడిప్పుడే షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల ఎకరాలకు యాసంగి సాగు చేరింది. యాసంగి సాధారణ సాగు 63.54 లక్షలు కాగా, ఇప్పటి వరకు 6.45 శాతం వరకు సాగైంది. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు యాసంగిలో వేరుసెనగ అత్యధికంగా లక్షన్నర ఎకరాల్లో సాగైంది.  మొక్కజొన్న 1.13 లక్షల ఎకరాల్లో సాగై రెండో స్థానంలో ఉండగా 78 వేల ఎకరాలతో పప్పుసెనగ సాగైందని వ్యవసాయ శాఖ తన నివేదికలతో వెల్లడించింది.

యాసంగి పంటలు వేసే 32 జిల్లాల్లో నాగర్​కర్నూల్​ జిల్లాలో రైతులు 1.13 లక్షల ఎకరాల్లో పంటలు వేసి అన్ని జిల్లాల కన్నా ముందు నిలిచారు. ఆ తరువాత 62 వేల ఎకరాలతో నిజామాబాద్​ రెండో స్థానంలో నిలిచింది. ఇక రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు సాగు షురూనే కాలేదు. ఇంకా కొన్ని జిల్లాల్లో  500 ఎకరాల్లోనే పంటలు వేశారు.  యాసంగి వరినాట్లు కేవలం 104 ఎకరాల్లోనే సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది.