- సీఎంఆర్ భర్తీ చేసేందుకు స్థానిక మిల్లర్లు సైతం క్యూ
- క్వింటాల్‌కు రూ.2,100 స్పాట్ పేమెంట్
- ఇప్పటికే 25 శాతం ధాన్యం సేల్
- ఇంకా ఓపెన్ కాని గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో పది రోజుల నుంచి యాసంగి వరికోతలు షురువయ్యాయి. దీంతో రైతుల వద్ద ఉన్న పచ్చివడ్లను కొనేందుకు మిల్లర్లు పోటీ పడుతున్నారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రా నుంచి వచ్చిన మిల్లర్లు వడ్లను కొని తరలిస్తుండగా, సీఎంఆర్ భర్తీకి లోకల్ మిల్లర్లు కూడా పోటీపడుతున్నారు. క్వింటా వడ్లకు రూ.2,100 ధర ఇచ్చి, కాంటాలు వేస్తున్నారు. వడ్లను ఎండబెట్టే తిప్పలు తప్పడం, మద్దతు ధర లభించడంతో విక్రయించడానికి రైతులు కూడా ఆసక్తి చూపెడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 25 శాతం పంట దిగుబడి సేల్ అయింది. గవర్నమెంట్ కేంద్రాల్లో వడ్లను అమ్మే రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించినా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇది సర్కార్ వడ్ల సేకరణ టార్గెట్‌పై ప్రభావం చూపనుంది.
అంచనాకు మించి వరిసాగు..
యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 5.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 4.16 లక్షల్లో ఎకరాల్లో నాట్లేశారు. యాసంగి సగటు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా అంచనాకు మించి రైతులు వరి పండించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మిల్లర్లు ఖరీఫ్‌లో క్వింటాల్ రికార్డు స్థాయిలో రూ.2,800 చెల్లించారు. యాసంగిలోనూ ఇదే ధర దక్కుతుందని రైతులు భావించగా, పంట విస్తీర్ణం పెరగడంతో మిల్లర్లు ధర తగ్గించారు.
నవంబర్ ఆఖరులో నాటేసిన రైతులు మార్చి10 తర్వాత కోతలు షురూ చేశారు. ఏప్రిల్ నాటికి దాదాపు కోతలు ముగుస్తాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో కోతలు కంప్లీట్ అయ్యాయి. యాసంగిలో 11.72 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, అందులో సన్నాలు 7.57 లక్షల టన్నులు, దొడ్డురకం 4.15 లక్షల టన్నులు ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు.
మిల్లర్ల ఎంట్రీ..
కోతలైన వెంటనే మిల్లర్లు వడ్లను కొనేస్తున్నారు. తొలుత రూ.2,200 చెల్లించి, ఇప్పుడు రూ.2,100కు తగ్గించారు. గవర్నమెంట్ మద్ధుతు ధర ఏ గ్రేడ్ వడ్లకు రూ.2,203, బీ గ్రేడ్‌కు రూ.2,183గా ఉంది. 17 శాతం తేమను అనుమతిస్తూ, బాగా ఆరబెట్టిన నాణ్యమైన వడ్లను మాత్రమే సర్కారు కొంటుంది. మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న వడ్లలో 30 శాతానికి పైగా తేమ ఉంటోంది. బాయిల్డ్ మిల్లుల్లో ఈ వడ్లను ఉడికించి రైస్‌గా మార్చే వీలున్నందున మిల్లర్లకు నష్టం లేదు. అకాల వర్షాల భయంతో రైతులు కూడా కోతలు ముమ్మరం చేస్తున్నారు.
సీఎంఆర్ భర్తీకి..
మరోపక్క గవర్నమెంట్ సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించిన మిల్లర్లు వాటి భర్తీకి ప్రైవేట్ కొనుగోళ్లు ఆరంభించారు. జిల్లాలో రూ.35 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ మిస్ అవడంతో 8 మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన వారితో పాటు లోకల్ మిల్లర్లు కలిసి సుమారు 3 లక్షల టన్నుల వడ్లను కొనేసినట్లు తెలుస్తోంది.
సర్కారు టార్గెట్ ఎలా..
ఈ సీజన్లో 6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. 462 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నాలుగు రోజుల కింద ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఓపెన్ కాలేదు. ఖరీఫ్‌లోనూ గవర్నమెంట్ కాంటాలు షురువయ్యే నాటికి మిల్లర్లు సింహభాగం కొనేశారు. దీంతో 6 లక్షల టన్నుల కొనుగోలు టార్గెట్ 3 లక్షల టన్నులు కూడా దాటలేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయితే పీడీఎస్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.