- 3.37 లక్షల టన్నులు సర్కార్ కొంటే
- 1.90 లక్షల టన్నులు మిల్లర్లు కొన్నరు
- క్లోజ్ అయిన 323 సెంటర్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఆటంకాల మధ్య యాసంగి వడ్ల కొనుగోళ్లు ముగిశాయి. మిల్లులో స్థలం లేక వడ్ల కొనుగోలులో జాప్యం జరిగింది. రోజుల తరబడి సెంటర్లలో ఉన్న రైతులు ఆందోళనలు నిర్వహించారు. మిల్లర్లు మద్ధతు ధర కంటే తక్కువకు వడ్లను కొనేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు జాప్యం కారణంగా కొందరు రైతులు తమ వడ్లను మిల్లర్లకు అమ్మేసుకున్నారు. జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. సీజన్లో వానలు సరిగా లేకపోవడంతో గత యాసంగి కంటే ఇప్పుడు కొంత సాగు తగ్గింది. భూగర్భ జలాలు తగ్గడంతో కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. దీంతో ఈసారి దిగుబడి తగ్గింది. సాగు చేసిన ప్రకారం 6 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంటే అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా 5. 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా వేశారు.
65 శాతం సివిల్ సప్లయ్ కొనుగోలు
తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచే వడ్ల కొనుగోలును ప్రారంభించాలని సర్కారు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం జిల్లాలో 323 కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ ప్రారంభించింది. కొనుగోలు ప్రారంభించిన తర్వాత లారీలు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. వచ్చిన లారీల నుంచి వడ్లను దించుకోక పోవడంతో రోజుల తరబడి మిల్లుల వద్దే ఉన్నాయి. దీంతో లారీలు రాక తూకం వేయకముందు.. వేసిన తర్వాత కూడా రోజుల తరబడి సెంటర్లలో వడ్లు ఉన్నాయి.
వానలు పడడం వల్ల అవి తడిచిపోయాయి. దీంతో మిల్లులకు వెళ్లిన వడ్ల లారీలు తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొదట ఏ గ్రేడ్ ఇచ్చిన వడ్లకు రెండోసారి బీ గ్రేడ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. టెండర్ వేసిన వడ్లను కాంట్రాక్టర్ తీసుకెళ్లక పోవడంతో మిల్లుల్లో స్థలాభావం ఏర్పడింది. దీంతో మిలర్లు వడ్లు దించుకోకుండా ఇబ్బందులు పెట్టారు. సమయానికి లారీలు రాకపోవడం, వానలు పడి వడ్లు తడిచి పోవడంతో రైతులు పలుమార్లు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల మధ్య 35,865 మంది రైతుల వద్ద రూ. 741 కోట్ల విలువైన 3.37 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ రూ. 620 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ లెక్కన దిగుబడిలో దాదాపు 65 శాతం వడ్లను సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్టయింది. కొనుగోళ్లు పూర్తి కావడంతో 323 సెంటర్లను క్లోజ్ చేశారు. అయితే మిల్లులకు చేరాల్సిన 241 టన్నుల వడ్లు ఇంకా సెంటర్లలోనే ఉన్నాయి.
35 శాతం మిల్లర్ల కొనుగోలు
మార్చిలో రైతులు వరి కోతలు ప్రారంభించగానే వడ్ల కొనుగోలు చేయడం కోసం మిల్లర్లు రంగ ప్రవేశం చేశారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్ ఏ గ్రేడ్ వడ్లకు రూ. 2203 ఉంటే మిల్లర్లు రూ. 1600 నుంచి రూ. 1700 మధ్య చెల్లించి కొనుగోలు చేయడం ప్రారంభించారు. కొనుగోలు సెంటర్లు ప్రారంభించినా.. స్పీడ్‌గా జరగకపోవడం, లారీలు రాకపోవడంతో పాటు వానలు పడుతూ ఉండడంతో మిల్లర్లకు అమ్మడానికి రైతులు మెగ్గు చూపారు. ఈ సీజన్లో మిలర్లు దాదాపు 1.90 లక్షల టన్నులు వడ్లను కొనుగోలు చేశారు.
కొనుగోళ్లు కంప్లీట్ చేశాం
ఏప్రిల్‌లో ప్రారంభించిన వడ్ల కొనుగోళ్లు కంప్లీట్ చేశాం. 33,865 మంది రైతుల నుంచి 3.37 లక్షల టన్నులను ధాన్యం కొన్నాం. వారికి ఇప్పటివరకూ రూ. 620 కోట్లను చెల్లించాం. ఇంకా రూ . 121 కోట్లను చెల్లించాల్సి ఉంది. కొనుగోలు సెంటర్లను క్లోజ్ చేశాము.
గోపీకృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్