శ్రీరంగాపూర్/నాగర్‌కర్నూల్, వెలుగు: త్వరలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు విడుదల చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామంలో బుధవారం ఆయన పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నాగసానిపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. గ్రామంలోని సమస్యలను మార్నింగ్ వాక్‌లో నేరుగా ప్రజలు తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. అంతకుముందు నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం అగ్రికల్చర్ కాలేజీ, పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ దక్షిణ మండల కిసాన్ మేళాలో మాట్లాడారు.
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోతోందని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారి అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలను పండించడం లేదన్నారు. ఏడాదిలో రెండుసార్లు భూసార పరీక్షలు చేయాలని, ఈ దిశగా వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా రైతులను చైతన్యపరచాలని నిరంజన్ రెడ్డి అన్నారు. పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూ.93 లక్షలతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ కంపెనీలు తయారుచేసిన ఎరువులు, రసాయన మందులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ పరిశోధకులు తయారు చేసిన వంగడాల స్టాల్స్ మంత్రి సందర్శించారు. పాలెం పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతులకు అవసరమైన నాణ్యమైన వంగడాలను అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, అడిషనల్కలెక్టర్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.