యాసంగి సాగు పడిపోయింది!..గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా.. 5,22,719 ఎకరాల్లో పంటల సాగు

  •     ఈ ఏడాది ఇప్పటివరకు 1,65, 060 ఎకరాలకే పరిమితం
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 ఎకరాల్లోనే వరి నాట్లు
  •     వరి కంటే మక్కల సాగే ఎక్కువ
  •     సాగర్​ నీళ్లు రాక దిక్కుతోచని స్థితిలో రైతులు 

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి యసంగిసాగు పూర్తిగా పడిపోయింది. వానలు అంతంతమాత్రంగానే కురవడం, నాగార్జున సాగర్​ నుంచి నీళ్లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5,22,719 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా.. ఈసారి మాత్రం ఇప్పటి వరకు 1,65, 060 ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. 

బోర్లు, బావుల్లో కూడా నీళ్లు లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు వరిని పక్కనపెట్టి మొక్కజొన్న సాగుపై దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లాలో వరి 7, 524 ఎకరాల్లో సాగు చేయగా,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఈ జిల్లాలో గతేడాది యాసంగిలో 62,417 ఎకరాల్లో వరి సాగుచేయగా, ఈసారి 36,867 ఎకరాల్లో సాగు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ అందులో ఒక్క శాతం కూడా సాగుకాకపోవడం గమనార్హం. 

ఎక్కడ.. ఏ పరిస్థితి? 

ఖమ్మం జిల్లాలో గత యాసంగి సీజన్​ లో 3,10,257 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో అధికారుల సాధారణ అంచనా ప్రకారం మొత్తం 1,66,319 ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 33,827 ఎకరాల సాగుకు మించలేదు. 

ఇందులో అత్యధికంగా 24,431 ఎకరాల్లో మక్కలు ఉండగా, 1,052 ఎకరాల్లో పెసలు, 346 ఎకరాల్లో వేరుశనగ, 249 ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. 22,637 ఎకరాల్లో పంట సాగు చేసేందుకు వరి నార్లు పోయగా, 7,524 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లయ్యాయి. కేవలం 25 ఎకరాల్లోనే  కూరగాయలను సాగు చేశారు. 59 ఎకరాల్లో కందులు, 20 ఎకరాల్లో జొన్నలు సాగు చేస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత యాసంగిలో 2,12,462 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో 1,72,960 ఎకరాల్లో సాధారణ సాగు అంచనా కాగా, 1,31,233 ఎకరాల్లో పంటలు వేశారని అధికారులు చెబుతున్నారు. ఇందులో 59,301 ఎకరాల్లో ఆయిల్ పామ్, 57,814 ఎకరాల్లో ఇతర పండ్ల తోటలున్నాయి. ఇవి కాకుండా 8,578 ఎకరాల్లో మొక్కజొన్న, 4081 ఎకరాల్లో మిర్చి, 559 ఎకరాల్లో వేరుశనగ, 118 ఎకరాల్లో పెసర, 108 ఎకరాల్లో మినుములు, 89 ఎకరాల్లో సన్​ ఫ్లవర్​, 458 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. 58 ఎకరాల్లో జొన్న, 47 ఎకరాల్లో మాత్రమే వరి వేశారు. 

సాగర్​ నీరు లేక.. 

ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సాగర్​ కాల్వల ద్వారా వచ్చే నీటిపైనే యాసంగి పంటల సాగు ఆధారపడి ఉంది. 17 మండలాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో సాగర్​ ఆయకట్టు ఉంది. కాల్వల ద్వారా చెరువులు నింపితే, బోర్లు, బావుల్లో నీటిమట్టం పెరిగి ఆరుతడి పంటలైనా వేసుకుంటారు. కానీ ఈసారి సాగర్​ లో నీళ్లు లేకపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం కేవలం తాగునీటికే సరిపోయే పరిస్థితులు ఉండడం, చెరువుల్లో నీళ్లు అంతంతమాత్రంగానే ఉండడం లాంటి కారణాలతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. 

నీళ్లులేక పడావు పెట్టిన.. 

సాగర్ ఆయకట్టు కింద నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వానాకాలం వరి వేసిన. కానీ వానల్లేక.. కాల్వలు రాక ఇబ్బంది పడ్డ. అందుకే ఈ యాసంగిలో పొలాన్ని పడావు పెట్టిన. జర నీళ్ల ఆదరువు ఉన్నచోట నా ఎకరానికి తోడు మరో రెండు ఎకరాలు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకొని మిర్చి పంట వేసిన. ఆ పంట కూడా సరిగా లేదు. 

- లింగనబోయిన వెంకటేశ్వరరావు, రైతు, చండ్రుపట్ల గ్రామం, కల్లూరు మండలం