యాసంగికి రెడీ .. యాదాద్రిలో 3.19 లక్షల ఎకరాల్లో సాగు

యాసంగికి రెడీ .. యాదాద్రిలో 3.19 లక్షల ఎకరాల్లో సాగు
  • 2.98 లక్షల ఎకరాల్లో వరి
  • అన్ని పంటలు కలిపి 21.320 ఎకరాల్లో సాగు
  • విత్తనాలు, ఎరువులకు ఇండెంట్​

యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్​–2024 యాక్షన్​ప్లాన్​ను అగ్రికల్చర్​ఆఫీసర్లు రెడీ చేశారు. ఈ సీజన్​లో కురిసిన వర్షాలు, సాగునీటి లభ్యత తదితర అంశాల ఆధారంగా ఆఫీసర్లు ప్లానింగ్​సిద్ధం చేశారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల ఇండెంట్​ను రూపొందించారు. ఇవి సకాలంలో రైతులకు అందేలా ఎరువులు, విత్తనాల డీలర్లను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న స్టాక్​ ఎంత, ఇంకా ఎంత తెప్పించాలన్న అంశంపై రోజువారీగా నివేదికలు రూపొందిస్తున్నారు.

 ఈ ప్లానింగ్​ను ఇప్పటికే డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్కారుకు నివేదిక అందించారు. వాతావరణశాఖ రూపొందించిన నివేదిక ప్రకారం సాధారణ వర్షపాతం 637.8 మిల్లీ మీటర్లు కురియాల్సి ఉండగా, ఇప్పటివరకు 711.2 మిల్లీ మీటర్లు కురిసింది. అయితే గ్రౌండ్​వాటర్ డిపార్ట్ మెంట్​లెక్కల ప్రకారం చెరువుల్లో పూర్తి శాతం వాటర్​ నిండలేదు. 

3.19 లక్షల ఎకరాల్లో..

ఆఫీసర్ల అంచనాల ప్రకారం యాదాద్రి జిల్లాలో అన్ని పంటలు కలిపి 3,19,320  ఎకరాల్లో సాగు చేయనున్నారు. గడిచిన యాసంగి, వాన కాలం సీజన్ల మాదిరిగానే ఈసారి పంటలు సాగు కానున్నాయి. ఎప్పటిలానే వరికి ఫస్ట్​ ప్రియారిటీ ఇచ్చారు. ఈ సీజన్​లో వరి 2.98 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇతర పంటలన్నీ కలిపి 21,320 ఎకరాల్లో సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. 

ఎరువులు, విత్తనాలు..

సాగుకు అవసరమయ్యే ఎరువుల ఇండెంట్​ను ఆఫీసర్లు రూపొందించారు. మొత్తంగా 74,500 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని లెక్కలు వేశారు. ఆయిల్ సీడ్స్ సహా ఇతర పంటలకు 35.20 క్వింటాళ్ల విత్తనాలు అవసరపడుతాయని నివేదిక రూపొందించి హయ్యర్ ఆఫీసర్లకు పంపించారు. 

57, 816 టన్నుల ఎరువులు..

ఈ సీజన్​లో మొత్తంగా 57,816  టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇందులో యూరియా 25,282  టన్నులు, డీఏపీ 10,419 టన్నులు, ఎంవోపీ 4167 టన్నులు, కాంప్లెక్స్​ 16,670 టన్నులు, ఎస్​ఎస్​పీ 1278 టన్నులు ఉన్నాయి. జిల్లాలోని సొసైటీలు, డీలర్ల వద్ద యూరియా 7663.98 టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 711.64, ఎంవోపీ 366.85, ఎస్​ఎస్​పీ 428.45, కాంప్లెక్స్​3566.71 టన్నులు ఉన్నాయి. మొత్తంగా 12,737.63 టన్నులు ఎరువులు అందుబాటులో ఉండగా, అవసరానికి సరిపడా తెప్పించడానికి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.